Advertisement

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ వల.. లక్ష రూపాయలు మోసం

మన పత్రిక, హైదరాబాద్: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉద్యోగినంటూ ఫోన్ చేసిన ఓ ఆగంతకుడు ఆయనకు వల వేశాడు. ‘వికసిత్ భారత్’ పథకం కింద నియోజకవర్గంలో 40 మందికి రూ.10 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తానని నమ్మించాడు.

ఇందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున మొత్తం లక్ష రూపాయలు పంపాలని సూచించాడు. ఇది నిజమేనని నమ్మిన రాజేశ్వర్ రెడ్డి, వెంటనే ఫోన్‌పే ద్వారా సైబర్ నేరగాడికి ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. ఆ తర్వాత డబ్బులు రాలేదని, మరోసారి పంపాలని అతడు తిరిగి కాల్ చేయడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ నంబర్, లావాదేవీల వివరాలను పోలీసులకు అందజేశారు. సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement