Advertisement

‘ఇరుముడి’ నాకు గౌరవాన్నిచ్చింది: రవితేజ

సినిమా: ‘‘నటుడిగా నాకెంతో సంతృప్తిని, గౌరవాన్ని అందించిన సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్ర విజయానికి, నాకు లభించిన పేరు ప్రఖ్యాతలకు పూర్తి క్రెడిట్ దర్శకుడు శివ నిర్వాణకే చెందుతుంది’’ అని కథానాయకుడు రవితేజ అన్నారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ‘‘హిట్లు, ఫ్లాప్‌లు వస్తుంటాయి. కానీ ఈ సినిమా నాకెంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. జీవీ ప్రకాష్ సంగీతం ఈ చిత్రానికి ఆత్మగా నిలిచింది. ఈ సినిమా కోసం చేసినన్ని నైట్ షూట్‌లు నేనెప్పుడూ చేయలేదు. శివ నిర్వాణ నిజంగా పని రాక్షసుడు’’ అని ప్రశంసించారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక పండగలా మారిందన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలంతా ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, కోనా వెంకట్, టీజీ విశ్వప్రసాద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement