WhatsApp
Advertisement

శత్రువులకు ఆశ్రయమిస్తే వదిలిపెట్టం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు!

మన పత్రిక వెబ్​డెస్క్, టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్ పోరు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికా బలగాలకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు (గల్ఫ్) దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. శత్రువులకు తమ భౌగోళిక ప్రాంతాన్ని వాడుకునేలా అవకాశం ఇస్తున్న దేశాలపై ఈ భీకర దాడులు కొనసాగుతాయని ఇరాన్ న్యాయశాఖ ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడు గులాంహుస్సేన్ మొహ్సేని ఎజెయి స్పష్టం చేశారు.

శనివారం తెల్లవారుజామున, మధ్యాహ్నం యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. యూఏఈ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా 15 క్షిపణులు, 119 డ్రోన్లను అడ్డుకోగా.. ఒక డ్రోన్ శకలాలు దుబాయ్ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది.

Advertisement

లొంగే ప్రసక్తే లేదు: ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్రంగా తిప్పికొట్టారు. “ఇరాన్ ప్రజలు లొంగిపోవాలన్న శత్రువుల కోరిక వారి సమాధుల్లోనే కలిసిపోవాలి” అని ప్రభుత్వ టీవీ ద్వారా ఆయన స్పష్టం చేశారు. అయితే, అమెరికా స్థావరాలు ఉన్న పొరుగు దేశాలపై దాడులు చేయాల్సి వస్తున్నందుకు ఆయన క్షమాపణలు చెప్పారు.

టెహ్రాన్ విమానాశ్రయంపై దాడి.. శ్రీలంక వద్ద ఇరాన్ నౌక మునక: మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఇరాన్‌పై తమ దాడులను ఉధృతం చేశాయి. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో.. ఇరాన్ భద్రతా దళాలకు చెందిన 16 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం ఇప్పుడు లెబనాన్, సైప్రస్, టర్కీ, అజర్‌బైజాన్‌లకు విస్తరించింది. శ్రీలంక తీరంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు చెందిన ఒక యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి టార్పెడోతో పేల్చేసింది.

లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వారం రోజుల్లో 294 మంది మరణించారు. ఇరాన్‌లో ఇప్పటివరకు 926 మంది పౌరులు మరణించగా, 6,000 మంది గాయపడినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సమాచారం అందిస్తున్నట్లు వార్తలు వస్తుండగా.. తాము ఆ నివేదికల పట్ల ఆందోళన చెందడం లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ పేర్కొన్నారు.

Advertisement