మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలపై వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఫీజులతో పాటు సేవలపై 18 శాతం జీఎస్టీ విధించడంతో మొత్తం భారం 77–78 శాతం వరకు పెరిగింది. కేటగిరీ-ఏ సేవల ఫీజు రూ.35 నుంచి రూ.62కి, కేటగిరీ-బీ సేవల ఫీజు రూ.45 నుంచి రూ.80కి పెరిగింది. దీంతో పౌర సేవల కోసం దరఖాస్తు చేసే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
మీసేవలో కేటగిరీ-ఏ సేవలు అదనపు పరిశీలన అవసరం లేకుండా అందుతాయి. కేటగిరీ-బీ సేవలు సంబంధిత శాఖల పరిశీలన తర్వాత మంజూరు అవుతాయి. గతంలో కేవలం ఫీజు చెల్లిస్తే సరిపోగా, ఇప్పుడు నాలుగు పేజీలకు మించి స్కానింగ్, ప్రింటింగ్‌కు ఒక్కో పేజీకి రూ.2.5 వసూలు చేయనున్నారు. ఉదాహరణకు కుల ధ్రువీకరణ పత్రం కోసం గతంలో రూ.45 చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం రూ.67.5కు పెంపుతో పాటు 18% జీఎస్టీ కలిపి సుమారు రూ.80 చెల్లించాల్సి వస్తోంది.
ఇక మీసేవ నిర్వాహకుల కమీషన్‌ను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. కేటగిరీ-ఏ సేవలపై రూ.40.34, కేటగిరీ-బీ సేవలపై రూ.52.10 వరకు కమీషన్ అందనుంది. ఈ-పాస్ దరఖాస్తుల్లో ఆధార్ ధ్రువీకరణ ఫీజును రూ.20 నుంచి రూ.35కి పెంచారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు మించి వసూలు చేస్తే 1100 లేదా 18004251110 నంబర్లలో ఫిర్యాదు చేయాలని సూచించింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
