Advertisement

హైదరాబాద్ యువతి నికిత హత్య కేసులో నిందితుడు ఆగ్రాలో దొరికాడు

మన పత్రిక, హైదరాబాద్: అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతంలో హత్యకు గురైన 27 ఏళ్ల హైదరాబాద్ యువతి నికిత గోడిశాల కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ శర్మ (26)ను ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాలాగుడా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక చీటింగ్ కేసు విచారణలో భాగంగా గాలింపు చేపట్టిన పోలీసు బృందం, నిందితుడు అక్కడ ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడనే సమాచారంతో వెళ్లి అదుపులోకి తీసుకుంది.

నికిత గడిచిన నాలుగేళ్లుగా అమెరికాలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తుండగా, ఈ ఏడాది జనవరి 2న ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు అందింది. ఆ తర్వాత కొలంబియాలోని ఆమె పూర్వపు రూమ్‌మేట్ అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో కత్తిపోట్లతో ఉన్న నికిత మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. హావార్డ్ కౌంటీ పోలీసుల వివరాల ప్రకారం 2025 డిసెంబర్ 31 సాయంత్రం ఈ హత్య జరిగింది. ఈ ఘటన అనంతరం అర్జున్ శర్మ అమెరికా నుంచి ఇండియాకు వచ్చేయగా, అమెరికా అధికారులు అతనిపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపి అరెస్టు వారెంట్ జారీ చేశారు.

Advertisement

చీటింగ్ కేసు విచారణలో వెలుగులోకి

నికిత తండ్రి ఆనంద్ గోడిశాల గత ఏప్రిల్‌లో హైదరాబాద్ పోలీసులకు అర్జున్ శర్మపై ఫిర్యాదు చేశారు. 2025 ఆగస్టు లేదా సెప్టెంబరు సమయంలో ఉద్యోగం కోల్పోయిన శర్మ, నికితతో పాటు ఆమె కుటుంబం నుంచి భారీ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ జరుపుతున్న క్రమంలో లాలాగుడా పోలీసులకు ఆగ్రాలో అతని స్థావరం గురించిన సమాచారం లభించింది.

అమెరికా హత్య కేసుతో పాటు నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా పెండింగ్‌లో ఉండటంతో లాలాగుడా పోలీసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించారు. అనంతరం నిందితుడిని న్యూఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 25న కోర్టు రిమాండ్ విధించింది. ఈ పరిణామంతో తమ కుమార్తె హత్య కేసు విచారణ ముందుకు సాగుతుందని భావిస్తున్నట్లు నికిత కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement