Advertisement

హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు

మన పత్రిక, హైదరాబాద్: ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోంది. భారీ ప్రకటనలు, గ్రాండ్ లాంచ్ ఈవెంట్లు, ‘ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్’ బోర్డుల వెనుక పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఫ్లాట్లను విక్రయించడానికి బిల్డర్లు, రియల్టర్లు తీవ్రంగా శ్రమిస్తుండగా, మార్కెట్‌లోని ఈ నిశ్శబ్ద పతనం ఇప్పుడు ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. నగరంలోని టాప్ రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం నెలకు కేవలం ఒకటి లేదా రెండు ఫ్లాట్లను మాత్రమే అమ్మగలుగుతున్నాయి. మార్కెట్‌లో డిమాండ్ బలంగా ఉందనే భ్రమను కల్పించడానికి డెవలపర్లు అగ్రెసివ్ మార్కెటింగ్ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భారీగా ఇన్వెంటరీ అమ్ముడుపోకుండా మిగిలిపోయింది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ (ఐటీ కారిడార్) ప్రాంతంలో కస్టమర్ల విచారణలు బాగా తగ్గిపోయాయని రియల్టర్లు వాపోతున్నారు.

Advertisement

రియల్ ఎస్టేట్‌కు దూరమవుతున్న ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ హౌసింగ్ డిమాండ్‌కు ఒకప్పుడు ఐటీ రంగ ఉద్యోగులే ప్రధాన బలంగా ఉండేవారు. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, డాలర్ ఆదాయం వచ్చే అమెరికా ఉద్యోగాల లభ్యత తగ్గడం వంటి కారణాల వల్ల పరిస్థితులు మారాయి. ఉద్యోగ అభద్రత, పెరుగుతున్న జీవన వ్యయాలు మరియు ఐటీ రంగంలో వస్తున్న ఏఐ (AI) మార్పుల వల్ల కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు.

20 ఏళ్ల పాటు భారీ ఈఎంఐల (EMIs) భారాన్ని మోయడానికి యువ నిపుణులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. యువ ఉద్యోగులు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌ను ‘డెడ్ ఇన్వెస్ట్‌మెంట్’గా భావిస్తూ స్టాక్స్, డిజిటల్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. సీనియర్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ భూమిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నప్పటికీ, యువతలో నమ్మకం తగ్గడం రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు పెద్ద సవాలుగా పరిణమించింది.

Advertisement