Advertisement

హైదరాబాద్‌లో ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ నిరసన ర్యాలీ

మన పత్రిక, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన ‘చలో లోక్ భవన్’ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఈ నిరసన చేపట్టాయి.

నెక్‌లేస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు నిరసన

టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో నెక్‌లేస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో పాటు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

Advertisement

పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేతలు

ర్యాలీ లోక్ భవన్ సమీపానికి చేరుకోగానే పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని, కేంద్రం ఎన్ని ఆంక్షలు విధించినా పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

Advertisement