మన పత్రిక, క్రైం: రెండో వివాహం చేసుకున్న భర్త వేధింపులను భరించలేక ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్, స్రవంతి(30) ప్రేమ వివాహం చేసుకుని మూసాపేట సమీపంలోని రాఘవేంద్ర సొసైటీలో నివసిస్తున్నారు. వీరికి కార్తిక్(12), కౌశిక్(10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రవీణ్ భవన నిర్మాణ పనులతో పాటు కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, స్రవంతి ఇళ్లలో పనిచేసేది. ఏడాది క్రితం అతడు స్రవంతి సోదరి వరసయ్యే మహేశ్వరి అలియాస్ సోనీని రెండో వివాహం చేసుకోవడంతో దంపతుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యపై దాడి చేయడం తరచూ జరుగుతుండేదని స్థానికులు తెలిపారు. ఇటీవల నర్సంపేటలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరగగా, మారుతానని ప్రవీణ్ హామీ ఇచ్చాడు.
అయితే సోమవారం రాత్రి మళ్లీ గొడవ జరిగినట్లు సమాచారం. మంగళవారం ఉదయం పనికి వెళ్లిన ప్రవీణ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తలుపులు లోపల నుంచి మూసివేయబడి ఉన్నాయి. స్పందన లేకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా స్రవంతి, ఇద్దరు పిల్లలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా మృతికి ప్రవీణే కారణమంటూ స్రవంతి బంధువులు వరంగల్‌లోని అతని ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. మరోవైపు మృతికి ముందు కార్తిక్ తన మేనమామకు వాట్సాప్ సందేశం పంపినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
