Advertisement

యూఏఎన్ నంబర్ మర్చిపోయారా? నిమిషాల్లో ఇలా తెలుసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్: I Forgot my UAN number – ద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా ఎంతో ముఖ్యం. భవిష్యత్ అవసరాలకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ఖాతాను ఆపరేట్ చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, కేవైసీ అప్డేట్ లేదా క్లెయిమ్ చేసుకోవడానికి 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అత్యంత కీలకం. ఈ ఒక్క నంబర్ లేకపోతే పీఎఫ్ సేవలను ఆన్‌లైన్‌లో పొందడం అసాధ్యం. చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు, లేదా చాలా కాలం గ్యాప్ వచ్చినప్పుడు తమ యూఏఎన్ నంబర్‌ను మర్చిపోతుంటారు. కేవలం పీఎఫ్ నంబర్ ఉంటే సరిపోతుందని భావిస్తారు కానీ, యూఏఎన్ లేకుండా ఖాతాలోకి లాగిన్ కాలేరు. ఇలాంటి సమయంలో పీఎఫ్ పనులన్నీ ఆగిపోయి చాలామంది ఆందోళన చెందుతుంటారు.

అయితే మీ యూఏఎన్ నంబర్ మర్చిపోయినా సరే, కంగారు పడాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ (EPFO) చెబుతోంది. ఖాతాదారుల సౌకర్యార్థం ఒక సులభమైన ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ యూఏఎన్ నంబర్‌ను తిరిగి పొందవచ్చు. దీనికోసం మీరు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు, పెద్ద పెద్ద ఫారాలు నింపాల్సిన అవసరం అసలే లేదు. మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఆధార్ లేదా పాన్ కార్డ్ వంటి ప్రాథమిక వివరాలు ఉంటే చాలు, ఇంట్లో కూర్చొనే మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా యూఏఎన్ నంబర్‌ను తెలుసుకోవచ్చు.

Advertisement

మీ యూఏఎన్ నంబర్ తెలుసుకోవడానికి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక మెంబర్ పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ హోమ్ పేజీలో కనిపించే ‘ఇంపార్టెంట్ లింక్స్’ (Important Links) విభాగంలో ‘Know your UAN’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘రిక్వెస్ట్ ఓటీపీ’పై క్లిక్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ధృవీకరించుకోవాలి. ఆ తర్వాత, మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లేదా పాన్ నంబర్ వివరాలను నమోదు చేయమని అడుగుతుంది. ఆ వివరాలు సరిగ్గా ఇచ్చిన తర్వాత చివరగా ‘Show My UAN’ పై క్లిక్ చేస్తే చాలు, క్షణాల్లో మీ 12 అంకెల యూఏఎన్ నంబర్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది.

Advertisement