Advertisement

అమరావతిపై జగన్ అనవసర గందరగోళం సృష్టిస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

మన పత్రిక: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ అనవసర గందరగోళం సృష్టిస్తూ ప్రజలను తికమక పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను జగన్ కనీసం ఒక్కసారైనా నేరుగా వచ్చి కళ్లారా చూడాలని ఆయన సూచించారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

అమరావతి అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా రూపుదిద్దుకోబోతోందని గొట్టిపాటి రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఇక్కడ భారీ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో పాటు ప్రముఖ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో అమరావతి అత్యంత అద్భుతమైన నివాస యోగ్యమైన నగరంగా మారుతుందని పేర్కొన్నారు. ఐకానిక్ భవనాలకు సంబంధించిన మొదటి డైమండ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 12 అంతస్తులు సిద్ధమవుతాయని తెలిపారు. అలాగే, ప్రాంతీయ అనుసంధానం కోసం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రాబోతుందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి తమ భూములను త్యాగం చేసిన రైతుల సహకారం వల్లే ఈ భారీ పనులు సాధ్యమవుతున్నాయని, వారి త్యాగాలను కూటమి ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి కొనియాడారు.

Advertisement
Advertisement