Advertisement

సుంకం తగ్గినా.. వినియోగదారులకు అందని రూ. ‘పది’ తగ్గింపు

మన పత్రిక, కేంద్రం: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 మేర తగ్గించిన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ తగ్గింపు నేరుగా వినియోగదారులకు లభించదనే అంశం స్పష్టమవుతోంది. ఈ ఉపశమనం ప్రధానంగా HP, BP, IOC వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకే వర్తిస్తుంది.

క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఖర్చులు భారీగా పెరగడంతో ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితిలో కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశముండటంతో, కేంద్రం తన పన్ను వాటాను తగ్గిస్తూ ఈ భారం కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేసింది. అంటే కంపెనీల ఆర్థిక స్థితిని స్థిరపరచడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.

Advertisement

అయితే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినప్పుడే ఆ ప్రభావం వినియోగదారులకు అందుతుంది. ప్రస్తుతం మాత్రం బంకుల్లో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అందువల్ల సామాన్యుడికి తక్షణ ఉపశమనం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంధన ధరలు పెరిగితే రవాణా వ్యయం అధికమై, దాని ప్రభావం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలను పూర్తిగా నియంత్రించడం కష్టమైనప్పటికీ, మరింత పెరగకుండా అడ్డుకోవడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఈ నిర్ణయం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మార్కెట్ స్థిరీకరణకు దోహదపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement