మన పత్రిక, వాషింగ్టన్: ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను (Nuclear Weapons) కలిగి ఉండబోమని తమతో అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా మార్క్‌వేన్ ముల్లిన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక విషయాలను వెల్లడించారు.
“ఇరాన్ ప్రతినిధులు మాతో చర్చిస్తున్నారు, వారు చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నారు” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న పాయింట్‌తోనే ఈ చర్చలన్నీ మొదలయ్యాయని ఆయన స్పష్టం చేశారు. “నేను ముందే ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు.. కానీ, తమ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండబోవని వారు ఇప్పటికే మాతో అంగీకరించారు” అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఒప్పందంపై ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
