మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికో, అధికారాన్ని అనుభవించడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్తులను దోచుకునే బందిపోట్ల నుంచి తెలంగాణ వనరులను రక్షించి, ప్రజలకు పంచడమే తన లక్ష్యమని తేల్చిచెప్పారు.
ఆరోపణలు వస్తే రద్దు చేయమన్నా.. సింగరేణి బొగ్గు సంస్థ టెండర్లపై ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’ శీర్షికలో అవాస్తవాలు రాశారని భట్టి మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసమో వండి వార్చిన కట్టుకథ ఇదని ఆరోపించారు. “టెండర్ల నిబంధనలను సింగరేణి బోర్డు ఖరారు చేస్తుంది తప్ప, మంత్రికి సంబంధం ఉండదు. అయినప్పటికీ ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేసి, ఫ్రెష్‌గా పిలవాలని బోర్డును ఆదేశించాను” అని భట్టి వివరణ ఇచ్చారు.
వైఎస్‌పై కోపంతో నాపై రాతలా? దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఆయనపై ఉన్న కోపాన్ని ఇలా తనపై చూపిస్తున్నారని భట్టి అనుమానం వ్యక్తం చేశారు. నిరాధారమైన వార్తలతో ప్రభుత్వం, మంత్రులు, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను 40 ఏళ్లుగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని, గాలికి రాజకీయాల్లోకి రాలేదని ఘాటుగా స్పందించారు. ఏం ఆశించి, ఎవరి మెప్పు కోసం ఈ కథనాలు రాశారో త్వరలోనే బయటపడుతుందని, పూర్తి వివరాలతో మళ్ళీ మాట్లాడుతానని తెలిపారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
