WhatsApp
Advertisement

టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!

మన పత్రిక వెబ్​డెస్క్: భారత క్రికెట్ స్టార్, టీమిండియా సంచలనం రింకు సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ప్రాణాంతక స్టేజ్-4 క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ వార్త విన్న వెంటనే టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఉన్న రింకు సింగ్ హుటాహుటిన తన కుటుంబం వద్దకు బయలుదేరారు.

రింకు సింగ్ తండ్రి మరణం పట్ల భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రింకు కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ఓ సామాన్య ఎల్పీజీ సిలిండర్ డెలివరీ కార్మికుడిగా పనిచేస్తూనే, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని కొడుకు క్రికెట్ కలకు ఖాన్‌చంద్ సింగ్ ఎనలేని మద్దతు ఇచ్చారు. తండ్రి కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించిన రింకు.. గతేడాది ఆయనకు రూ.3.19 లక్షల విలువైన ‘కవాసకి నింజా’ బైక్‌ను బహుమతిగా ఇచ్చి తన ప్రేమను చాటుకున్నారు.

Advertisement

తండ్రి అనారోగ్యం కారణంగా రింకు గత కొద్దిరోజులుగా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చెన్నైలో గురువారం జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌కు ముందు కూడా ఆయన ఆసుపత్రికి వెళ్లి వచ్చారు. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో లేకపోయినప్పటికీ, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సూర్యకుమార్, అభిషేక్ శర్మల స్థానంలో మైదానంలో సేవలందించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తండ్రి అంత్యక్రియల అనంతరం మార్చి 1న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న కీలక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు రింకు తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement