మన పత్రిక, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. ఇరాన్ ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ మార్గాన్ని మూసివేయడంతో భారత్‌కు గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, వాణిజ్య అవసరాలకు గ్యాస్ అందక దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
బెంగళూరు, ముంబై నగరాల్లో గ్యాస్ సరఫరా లేక ఇప్పటికే అనేక హోటళ్లు మూతపడ్డాయి. ముంబైలో 20 శాతం హోటళ్లు మూసివేయగా, బెంగళూరులో చాలా చిన్న రెస్టారెంట్లు కేవలం టీ, కాఫీలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో రూ.1,400 నుంచి రూ.1,500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని పీజీలు, హాస్టళ్లలో గ్యాస్ సరఫరా 75 శాతం పడిపోవడంతో విద్యార్థులకు భోజనాల వసతి కష్టంగా మారింది. గుజరాత్‌లోని మోర్బీలో వంద సిరామిక్ యూనిట్లు మూతపడగా.. కేరళ, యూపీ, బీహార్ రాష్ట్రాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ సంక్షోభంపై జాతీయ హోటల్ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతూ లేఖలు రాశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ కొరత లేదని, విశాఖపట్నంలోని నిల్వల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి కేంద్ర పెట్రోలియం శాఖ ముగ్గురు అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, గృహ వినియోగానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది.
