Advertisement

ఉపాధి హామీ రద్దుకు మోదీ కుట్ర.. అదానీ, అంబానీ కోసమే ఇదంతా

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. పేదల పాలిట వరమైన ఈ పథకాన్ని రద్దు చేసి, గ్రామీణ ప్రజలను మళ్లీ బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

కార్పొరేట్ల కోసమే ఈ తతంగం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఉండటం వల్ల కూలీలు పట్టణాలకు వలస వెళ్లడం లేదని, దీంతో అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు పని చేసే కార్మికులు దొరకడం లేదని రేవంత్ విశ్లేషించారు. అందుకే ఉపాధి హామీని రద్దు చేసి, గ్రామీణ పేదలను పట్టణాలకు రప్పించి, వారిని కార్పొరేట్లకు వెట్టి చాకిరీ చేసే బానిసలుగా మార్చాలని మోదీ చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తరహా పాలనను తలపిస్తోందన్నారు.

Advertisement

ఓటు హక్కుపైనా దెబ్బ? ‘వికసిత్ భారత్’ పేరుతో మోదీ ‘సంక్షోభ భారత్’ను సృష్టిస్తున్నారని సీఎం విమర్శించారు. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, పేదల ఓటు హక్కును హరించడానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) పేరిట మరో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి, దాని ఉద్దేశాన్ని కేంద్రం నీరుగారుస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ కార్యాచరణ ఇదే కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను సీఎం ప్రకటించారు.

  • జనవరి 20 నుంచి 30 వరకు: ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, కేంద్రం తెస్తున్న కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలి.
  • ఫిబ్రవరి 3 నుంచి: తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి, కేంద్రం వైఖరిని ఎండగట్టాలి.

రైతులు వ్యవసాయ చట్టాలను ఎలా అడ్డుకున్నారో, అదే స్ఫూర్తితో ఈ పేదల వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement