మన పత్రిక, తెలంగాణ: చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయం పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా బాసర ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్ను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రణాళికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా ఆలయ పవిత్రతను కాపాడేలా పలు కీలక సూచనలు చేశారు.
మొత్తం రూ.225 కోట్ల వ్యయంతో బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న సీఎం స్వయంగా బాసరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంప్రదాయబద్ధంగా, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం జరగాలని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో విశాలమైన రహదారులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయ పరిసరాల్లో రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించేలా కఠిన నిబంధనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
