మన పత్రిక వెబ్డెస్క్, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన.. భాషాపరంగానే కాకుండా జలాల విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉండాలని ఆకాంక్షించారు. మాతృభాషను కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని, భాషతో పాటు అభివృద్ధి విషయాల్లోనూ తెలుగువారంతా ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు.
మాతృభాష అమ్మతో సమానం మాతృభాష అమ్మతో సమానమని, పరభాష వ్యామోహంలో పడి మూలాలను మర్చిపోవద్దని చంద్రబాబు హితవు పలికారు. ప్రపంచంలో రాణించడానికి ఇంగ్లీష్ అవసరమే అయినప్పటికీ, మాతృభాషను విస్మరిస్తే మనల్ని మనం కోల్పోయినట్లేనన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన ఎన్టీఆర్, భాషాప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు, రెండు రాష్ట్రాలు కలవాలని పోరాడిన బూర్గుల రామకృష్ణారావు వంటి మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. టెక్నాలజీ సాయంతో భాషను సులువుగా కాపాడుకోవచ్చని సూచించారు.
నీటి వాటాలపై ఆసక్తికర వ్యాఖ్యలు నీటి పంపకాలు, ఇతర అంశాల్లో తెలుగువారు కలిసే ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు తాము అడ్డుపడలేదని, తెలంగాణ గోదావరి నీటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. గంగా-కావేరి నదుల అనుసంధానం జరగాలని, గోదావరి-పెన్నా అనుసంధానంతో దేశంలో నీటి కష్టాలు తీరాలన్నదే తన కోరిక అని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదని, సమైక్యత అవసరమని ఉద్ఘాటించారు.
