Advertisement

అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు కీలక విజ్ఞప్తి!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) అభివృద్ధి, రాజధాని భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా కీలక అడుగులు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని అధికారిక రాజధానిగా ఖరారు చేస్తే, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవ్వడంతో పాటు ప్రజల్లో ఉన్న అనిశ్చితి తొలగిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

బడ్జెట్, పోలవరంపై చర్చ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అమిత్ షాకు వివరించిన సీఎం, రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ, దాన్ని సకాలంలో పూర్తి చేయడానికి కేంద్రం సహకారం, నిధులు అత్యవసరమని స్పష్టం చేశారు. అలాగే, ఉపాధి హామీ పథకం నిధుల వాటాలో ఇటీవల జరిగిన మార్పుల వల్ల రాష్ట్రంపై భారం పడుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో పనులు మందగించే ప్రమాదం ఉన్నందున ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.

Advertisement

కొత్త జిల్లాలు, మౌలిక వసతులు పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు కేంద్రం సహకరించాలని, భారీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు. అమిత్ షాతో భేటీకి ముందు చంద్రబాబు తన నివాసంలో శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులతో భవిష్యత్తు పెట్టుబడులపై చర్చించారు.

Advertisement