Advertisement

పట్నాలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ

మన పత్రిక: బిహార్ రాజధాని పట్నాలో బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సదాకత్ ఆశ్రమంలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ కాంగ్రెస్ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, అక్కడ మోహరించి ఉన్న కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు

ఇరువర్గాల మధ్య మొదలైన తోపులాట కొద్దిసేపటికే హింసాత్మకంగా మారింది. కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో డజను మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఘర్షణల కారణంగా దానాపూర్-గాంధీ మైదాన్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమయంలో బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ సహా పలువురు సీనియర్ నాయకులు పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు.

Advertisement
Advertisement