మన పత్రిక, వెబ్‌డెస్క్: ఈ కేబినెట్ నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 8వ వేతన కమిషన్ తన సిఫార్సులను 18 నెలల్లోపు ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ నూతన సిఫార్సులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
కేంద్రం తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్‌ను కేంద్రం నియమించింది. కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్ పులక్ ఘోష్, పంకజ్ జైన్ వ్యవహరించనున్నారు.
వేతన సంఘం ఏర్పాటుకు ముందు రక్షణ, హోం మంత్రిత్వ శాఖలు, సిబ్బంది మరియు శిక్షణ శాఖ (DoPT) సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరించడానికి సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.
7వ వేతన కమిషన్ 2014 ఫిబ్రవరిలో ఏర్పాటై, 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అదే విధానంలో, 8వ పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సి ఉంది. కమిషన్ సిఫార్సుల సమర్పణకు 18 నెలలు పట్టినా, 2026 జనవరి 1 నుండే అమలు చేసి, ఉద్యోగులకు పెరిగిన వేతనాలను బకాయిలతో (అరియర్స్) కలిపి చెల్లిస్తారని సమాచారం.
► Read latest Telugu News
► Follow us on Google News

