మన పత్రిక: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రెండు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని అల్లూరి, శ్రీకాకుళం, పోలవరం, కర్నూలు, నంద్యాల, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో వేడి గాలులు తీవ్రంగా వీచే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ భిన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులు బలంగా వీచుతున్నాయి. ఈ వర్షాలు క్రమంగా హైదరాబాద్ వైపు విస్తరిస్తున్నాయి. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రాబోయే గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
