Advertisement

హైదరాబాద్‌ను ‘గ్లోబల్ ఫిల్మ్ హబ్’గా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉందని, దానిని అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.

సినిమా అనేది కేవలం వినోద సాధనమే కాదని, దాని ద్వారా బలమైన సామాజిక సందేశాలతో పాటు వాణిజ్యపరంగా రాష్ట్రానికి ఆదాయం, వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో సినిమా రంగానికి కావాల్సిన అద్భుతమైన ఎకో సిస్టమ్, ప్రతిభావంతులైన యువత పుష్కలంగా ఉన్నారని, ఈ వనరులను సద్వినియోగం చేసుకొని నగరాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చాలన్నారు. పరిశ్రమకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు పరిశ్రమ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని, వాటి పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.

Advertisement

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి బేధభావాలు లేకుండా జరగాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ నేతృత్వంలోని జ్యూరీ ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించనుందని ఆయన అధికారికంగా ప్రకటించారు.

Advertisement