Advertisement

రూ.225 కోట్లతో బాసర ఆలయ పునరభివృద్ధి.. సీఎం రేవంత్ శంకుస్థాపన

మన పత్రిక, నిర్మల్: తెలంగాణలోని బాసరలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయ పునరభివృద్ధి పనులకు సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.225 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు.

ఆగమ శాస్త్ర నిబంధనలు, శృంగేరి శారదా పీఠం సూచనల మేరకు పూర్తి రాతి నిర్మాణంతో ఈ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆలయాన్ని ఏకంగా 62,000 చదరపు అడుగులకు విస్తరించనున్నారు. ఇందులో భాగంగా 2,000 చదరపు అడుగుల గర్భాలయాన్ని 5,000 చదరపు అడుగులకు పెంచనున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు వైపులా 7 అంతస్తుల గోపురాలు, నాలుగు వైపులా 33 అడుగుల వెడల్పుతో మాడ వీధులు నిర్మించనున్నారు.

Advertisement

భక్తుల సౌకర్యార్థం ఒకేసారి 6,000 మంది వేచి ఉండేలా 70,000 చదరపు అడుగుల్లో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు 200 మంది కూర్చునే ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల్లో వంటశాల, భోజనశాల, సోలార్ పార్కింగ్, భూగర్భ మార్గం, పుష్పవనం, ఆలయ సముదాయం వెలుపల ఒక ఆరోగ్య కేంద్రాన్ని సైతం నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement