తెలుగు సంస్కృతికి, అందానికి, హావభావాలకు నిలువెత్తు సంతకం బాపు. నేడు (డిసెంబర్ 15) ఆ ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడి జయంతి. ఈ సందర్భంగా బాపు-రమణల స్నేహం, వారు సృష్టించిన దృశ్య కావ్యాల గురించి మనపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం.
మన పత్రిక, వెబ్‌డెస్క్: ముగ్ధ మనోహరమైన రూపాలను కళ్లకు కట్టినట్లు చూపించగలిగే అద్భుతమైన కుంచె బాపు సొంతం. ఆయన గీసే బొమ్మలు కేవలం కాగితంపై గీతలు కాదు; అవి మాట్లాడతాయి, సిగ్గుపడతాయి, నవ్విస్తాయి, ఒక్కోసారి వెక్కిరిస్తాయి కూడా. సకల హావభావాలను ప్రదర్శించే ఆయన రేఖా చిత్రాలు కార్టూన్లుగా మారి పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే నేటికీ అందమైన అమ్మాయి అంటే ‘బాపు బొమ్మ’ అనే నానుడి తెలుగునాట స్థిరపడిపోయింది.
బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కంతేరులో 1933 డిసెంబర్ 15న వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు ఆయన జన్మించారు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన బాపు, అదే ఏడాది ‘ఆంధ్ర పత్రిక’లో వ్యంగ్య చిత్రకారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేవలం కార్టూన్లకే పరిమితం కాకుండా కథలకు బొమ్మలు, పత్రికల ముఖచిత్రాలు, పురాణ ఇతివృత్తాలు ఇలా అన్ని రంగాల్లోనూ తన కుంచెతో అద్భుతాలు సృష్టించారు.
బాపు ప్రస్థానంలో ముళ్లపూడి వెంకట రమణను విడదీసి చూడలేం. 1942లో మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో వీరిద్దరి స్నేహం మొదలైంది. రమణ రాతకు బాపు గీత తోడై ‘బుడుగు’, ‘సీగాన పెసూనాంబ’, ‘అప్పుల అప్పారావు’ వంటి అద్భుతమైన పాత్రలు పుట్టుకొచ్చాయి. ‘ఒకరిది లేఖా చిత్రం.. మరొకరిది రేఖా చిత్రం’ అన్నట్లుగా వీరి స్నేహం సాగింది. బాలల మ్యాగజైన్ ‘బాల’లో రమణ రాసిన ‘అమ్మ మాట వినకపోతే’ కథకు బాపు బొమ్మలు వేయడంతో ప్రారంభమైన ఈ జర్నీ చివరి వరకూ కొనసాగింది.
సినిమా రంగంలోనూ బాపు తనదైన ముద్ర వేశారు. 1967లో ‘సాక్షి’ సినిమాతో దర్శకుడిగా మారి మొత్తం 41 చిత్రాలను తెరకెక్కించారు. అందులో ‘ముత్యాల ముగ్గు’, ‘సీతాకల్యాణం’, ‘మిస్టర్ పెళ్లాం’ వంటి సినిమాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. బాపు తెరకెక్కించిన చిత్రాలు అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమయ్యాయి. ముఖ్యంగా ‘సీతాకల్యాణం’ లండన్, షికాగో ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితం కావడం విశేషం.
ఆయన కళా సేవకు గాను ఎన్నో పురస్కారాలు వరించాయి. 2013లో పద్మశ్రీ పురస్కారం, 2001లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు, పలు నంది అవార్డులను స్వీకరించారు. ప్రముఖ కవి ఆరుద్ర చెప్పినట్లు ‘కొంటెబొమ్మల బాపు.. కొన్ని తరముల సేపు..’ అన్న మాటలు అక్షర సత్యాలు. 2014 ఆగస్టు 31న బాపు తుదిశ్వాస విడిచినా, ఆయన గీసిన గీతలు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
