WhatsApp
Advertisement

బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష

మన పత్రిక, బెంగళూరు: పాఠశాలకు కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని సుమారు రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. యలహంక అత్తూరు లేఅవుట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విద్యార్థికి ఇచ్చిన శిక్ష గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ వారిపట్ల దురుసుగా, అహంకారంతో ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రిన్సిపాల్, తల్లిదండ్రుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

Advertisement

వైరల్ వీడియోపై బెంగళూరు నగర పోలీసులు సీరియస్‌గా స్పందించారు. పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసించడం నేరమని పేర్కొంటూ, జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. చట్టప్రకారం బాలుడి గుర్తింపును వెల్లడించే ఫోటోలు, వీడియోలను షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ.. బంధువులు రెచ్చగొట్టడం వల్లే ప్రిన్సిపాల్ అలా ప్రవర్తించి ఉండొచ్చని, అయితే ఆమెపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

Advertisement