Advertisement

నారాయణపేట జిల్లాలో దారుణం.. ఐదేళ్ల పాప హత్య

మన పత్రిక, క్రైం, TG: నారాయణపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పసిపాపను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి చెరువు కట్టపై పడవేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంజప్ప, శిరీష దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరికి తేజశ్రీ (5) అనే కూతురు, ఒక చిన్న కుమారుడు ఉన్నారు. కుమారుడు చిన్నవాడిగా ఉండటంతో తమ వెంట తీసుకెళ్లగా, తేజశ్రీని గ్రామంలోనే నానమ్మ సంజమ్మ, తాత సంజయ్య వద్ద ఉంచారు. తేజశ్రీ స్థానిక అంగన్వాడీలో చదువుతోంది.

వేసవి కాలం కావడంతో బుధవారం రాత్రి ఇంటి ఆవరణలోనే నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి చెరువు కట్ట వైపు వెళ్తున్న కొందరు యువకులు పాప మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న తాతమామలు, గ్రామస్తులు పాప మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు.

Advertisement

పాప ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో దోపిడీ కోణంలో ఈ దారుణం జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న నారాయణపేట సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని జాగిలాలు, క్లూస్ టీంల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Advertisement