Advertisement

TG: మెదక్ జిల్లాలో దారుణం.. అత్యాచారం చేసి, కొట్టి చనిపోయిందనుకుని వెళ్లిపోయారు..!

TELANGANA: ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కొల్చారం మండలంలోని సంగాయిగూడ తండాకు చెందిన, అడ్డా కూలీగా పనిచేసే ఓ మహిళ అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Advertisement

పోలీసుల అంచనా ప్రకారం శుక్రవారం ఉదయం టిఫిన్‌తో మెదక్ అడ్డాకు వచ్చిన ఈ మహిళను పని ఇస్తామని చెప్పి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల ఆలయ సమీపంలోని ఓ వెంచర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేయబోగా అడ్డుకుంది. దీంతో దుండగులు ఆమె చేతులను చీరతో కట్టేసి దారుణంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను విచక్షణా రహితంగా కొట్టారు. ఆమె మృతి చెందిందని భావించి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

Advertisement

రాత్రంతా కొన ఊపిరితో..

ఘటన జరిగిన రాత్రంతా తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కొన ఊపిరితో ఉన్న మహిళను శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆమెను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.

Advertisement

ఐదుగురు సంతానం..

మృతురాలు మెదక్ మండలానికి చెందిన మహిళ. ఈమెకు ఐదుగురు సంతానం. పిల్లలను పోషించేందుకు దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తుంటారు. ఈ కేసులో ఇద్దరు, ముగ్గురు దుండగులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మెదక్ అడ్డా నుంచి ఏడుపాయల వరకు ఆమె ఎలా వచ్చిందో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement