Advertisement

2,419 బస్సులు బంద్: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీకి బిగ్ షాక్..

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ (Sankranti) రద్దీ మొదలైన వేళ ఏపీఎస్ఆర్టీసీకి, ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పండుగ కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించిన ఆర్టీసీకి.. అద్దె బస్సుల యజమానుల నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు 2,419 అద్దె బస్సుల యజమానులు హెచ్చరిస్తున్నారు. పండుగ సమయంలో అత్యంత కీలకమైన అద్దె బస్సులు నిలిచిపోతే గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు.

అద్దె పెంపు డిమాండ్.. కారణం ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. దీనివల్ల బస్సుల నిర్వహణ భారం విపరీతంగా పెరిగిందని, నష్టాలు వస్తున్నాయని యజమానులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో బస్సుకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం కేవలం రూ.5,200 మాత్రమే ఇచ్చేందుకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ మొత్తంపై అసంతృప్తి వ్యక్తం చేసిన యజమానుల సంఘం, అద్దెను మరింత పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

Advertisement

భారీగా ప్రత్యేక సర్వీసులు మరోవైపు సంక్రాంతి కోసం ఏపీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే మొత్తం 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

  • మొత్తం సర్వీసులు: 8,432 (ఇందులో 6,000 బస్సులు రాష్ట్రం లోపలే తిరుగుతాయి).
  • అంతర్రాష్ట్ర సర్వీసులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్గాల్లో 2,432 సర్వీసులు.
  • పండుగకు ముందు: 3,857 ప్రత్యేక సర్వీసులు.
  • పండుగ తర్వాత: 4,575 ప్రత్యేక సర్వీసులు.

సమ్మె జరిగితే ఈ ప్రణాళికలన్నీ తలకిందులయ్యే ప్రమాదం ఉండటంతో, సమస్యను పరిష్కరించేందుకు ఆర్టీసీ అధికారులు చర్చలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.2,419 బస్సులు బంద్

Advertisement