మన పత్రిక వెబ్‌డెస్క్, అమరావతి: ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విద్యుత్ శాఖలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీపికబురు అందించారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL) పరిధిలో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన శాసనసభ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పోస్టుల వివరాలను వెల్లడించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఏకంగా 2,947 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సభకు తెలిపారు. ఇందులో ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్‌మెన్ (JLM) 1,260, అసిస్టెంట్ లైన్‌మెన్ 1,084, లైన్‌మెన్ 22 పోస్టులు ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును ఇప్పటికే వేగవంతం చేశామని, క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా లో-వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. లోడ్ ఆధారంగా అవసరమైన చోట కొత్త సబ్ స్టేషన్లు, ఎలక్ట్రికల్ డీఈ కార్యాలయాలను సైతం యుద్ధప్రాతిపదికన మంజూరు చేస్తున్నామని సభకు వివరించారు.
మరోవైపు రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ పైనా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం మూడు డిస్కంల పరిధిలో లక్షకు పైగా కొత్త ఉచిత వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న మరో 46 వేల కనెక్షన్లను వచ్చే సీజన్ నాటికి మంజూరు చేస్తామన్నారు. అలాగే రాబోయే మే నెల నుంచి ఫీడర్ లెవల్ సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, ఇవి పూర్తైతే రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందిస్తామని గొట్టిపాటి రవికుమార్ సభకు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
