Advertisement

ఏపీలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ: కొత్తగా రూర్బన్

మన పత్రిక, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జనాభా, ఆదాయం ప్రాతిపదికన పంచాయతీలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తూ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ నూతన సంస్కరణల్లో భాగంగా కొత్తగా ‘రూర్బన్’ పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. 10,000కు పైగా జనాభా ఉండి, రూ. కోటికి పైగా వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలకు ఈ రూర్బన్ హోదా దక్కుతుంది. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉండాలి. గ్రామాల్లో సైతం పట్టణ స్థాయి సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

మిగిలిన పంచాయతీలను మూడు గ్రేడులుగా విభజించారు. 3 వేల నుంచి 10 వేల మధ్య జనాభా, రూ. 30 లక్షల నుంచి రూ. కోటి లోపు ఆదాయం ఉంటే గ్రేడ్-1 పంచాయతీగా (గిరిజన ప్రాంతాల్లో 2,500 – 5,000 జనాభా) గుర్తిస్తారు. ఇక 2 వేల కంటే తక్కువ జనాభా ఉంటే గ్రేడ్-2 (గిరిజన ప్రాంతాల్లో 1,500 – 2,000), 1,500 కంటే తక్కువ జనాభా ఉంటే గ్రేడ్-3 పంచాయతీలుగా పరిగణించనున్నారు.

ఈ విషయంపై అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement