WhatsApp
Advertisement

AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌తో పాటు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష (AP BRAGCET 2026) జరగనుంది.

ఇప్పటికే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో, అధికారులు పరీక్ష నిర్వహణపై దృష్టి సారించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ apbragcet.apcfss.in నుంచి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి ఒరిజినల్ హాల్ టికెట్ ఉంటేనే విద్యార్థులను అనుమతిస్తారని, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపించే ‘కాండిడేట్ లాగిన్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. వివరాలు సరిచూసుకుని లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే హాల్ టికెట్‌ను వెంటనే ప్రింట్ లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష రోజున తమ వెంట తీసుకెళ్లాలి.

ఈ ప్రవేశ పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే.. 5వ తరగతి ప్రవేశాలకు 50 మార్కులకు రెండు గంటల పాటు ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు 100 మార్కులకు రెండున్నర గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. పదో తరగతి స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఇంటర్ ప్రవేశ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి పావు (1/4) మార్కు కోత విధిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో అందుబాటులో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన స్కోర్, ర్యాంకుల ఆధారంగానే కౌన్సెలింగ్ ద్వారా రిజర్వేషన్ల వారీగా సీట్లను కేటాయిస్తారు. కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు ఉంటుండటంతో ఏపీ గురుకులాల్లో సీట్ల కోసం ప్రతి ఏటా తీవ్ర పోటీ నెలకొంటోంది.

Advertisement