Advertisement

ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నూతన మ్యాప్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఈ నెల 2న అధికారికంగా ఈ మ్యాప్‌ను ప్రకటించింది. మొత్తం 28 జిల్లాలతో రూపొందించిన ఈ మ్యాప్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాల సరిహద్దులను స్పష్టంగా చూపించారు. ఈ మ్యాప్‌లో అత్యంత ముఖ్యమైన అంశం అమరావతి కు ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల మధ్య ప్రాంతంలో అమరావతిని ‘రాష్ట్ర రాజధాని’గా హైలెట్ చేశారు. అయితే అమరావతికి ప్రత్యేకంగా వేరు బౌండరీలను నిర్ధేశించకుండా, రాజధాని ప్రాంతంగా గుర్తించడం గమనార్హంగా మారింది.

ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న జిల్లాలకు అదనంగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేశారు. తాజా మ్యాప్‌లో ఈ రెండు జిల్లాల సరిహద్దులను కూడా స్పష్టంగా చూపించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కు చేరింది. ఈ మ్యాప్ విడుదల వెనుక ప్రధాన ఉద్దేశం ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో జిల్లాల వారీగా సహాయక చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సరిహద్దుల సందిగ్ధతను తొలగించి, పరిపాలనను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

Advertisement
Advertisement