మన పత్రిక వెబ్డెస్క్, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్హులైన రైతులకు రూ.1.50 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. తుళ్లూరు మండలం వడ్లమానులో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
జనవరి 6 డెడ్ లైన్ ఈ రుణమాఫీ పథకం జనవరి 6వ తేదీ వరకు పంట రుణాలు తీసుకున్న రాజధాని ప్రాంత రైతులకు వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. రూ.1.50 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం కోసం త్యాగాలు చేసిన రైతులకు అండగా ఉంటామని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా సముదాయం వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.
వేగంగా రెండో దశ భూసేకరణ రాజధానిలో రెండో విడత భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ నిర్మాణాల కోసం ఏడు గ్రామాల్లో దశలవారీగా భూములు సేకరిస్తున్నారు. వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి తదితర గ్రామాల పరిధిలో మొత్తం 16,666 ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. పూలింగ్ పూర్తయిన వెంటనే మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వివరించారు.
