మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బజార్‌హట్‌నూర్ మండలం పిప్పిరి గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానుండటంతో కొత్త ప్రకటనలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన కీలకంగా మారింది. జిల్లాలో ప్రధాన సమస్యలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ప్రవహించే పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ఆనకట్ట పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. భోరజ్ మండలం కోర్ట-చనాఖ వద్ద నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 51 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. అయితే కాలువలు, రిజర్వాయర్ల కోసం భూసేకరణ, పరిహారం కోసం రూ.1000 కోట్ల నిధులు అవసరమని పేర్కొంటున్నారు.
ఇక జిల్లాకేంద్రంలోని సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణపై కూడా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిశ్రమ తిరిగి ప్రారంభమైతే సుమారు 5 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసే అంశంపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా నేరడిగొండ మండలం కుప్టి సమీపంలో ప్రతిపాదిత బహుళార్థసాధక ప్రాజెక్టుపై కూడా ఆశలు పెరిగాయి. సుమారు రూ.1700 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుండగా, సాగునీరు, విద్యుత్, తాగునీటి అవసరాలు తీర్చేలా ఉపయోగపడనుంది. జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై కూడా చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే భూసేకరణకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, అమలులో స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. అలాగే బోథ్ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని స్థానికుల డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో ఈ అంశాలపై స్పష్టత వస్తుందా? కొత్త వరాలు ప్రకటిస్తారా? అనే దానిపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.
