Advertisement

నమ్మించి వంచించిన కిరాతకుడు.. టీచర్ సూసైడ్

మన పత్రిక, AP: నమ్మిన ప్రేమే ఆమెకు శాపమైంది. పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన ఓ కిరాతకుడి చేతిలో మోసపోయిన యువతి, చివరకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ ఆమె రాసిన చివరి అక్షరాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని పామూరు మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. అయ్యవారిపల్లికి చెందిన మాధవి (24) స్థానికంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు నాగూర్ భాష అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే, నాగూర్ భాషకు ఇదివరకే వివాహం జరిగినట్లు మాధవికి ఆలస్యంగా తెలిసింది. నిజం తెలుసుకున్న ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనై, అతడిని దూరం పెట్టాలని నిర్ణయించుకుంది.

మాధవి తనను వదిలేస్తుందన్న కోపంతో నాగూర్ భాష రాక్షసుడిలా మారాడు. గతంలో వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో తీసుకున్న వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, పరువు తీస్తానని బెదిరింపులకు దిగాడు. రోజురోజుకూ వేధింపులు పెరగడంతో మాధవి తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఆ కిరాతకుడి నుండి తప్పించుకునే మార్గం లేక, చావే శరణ్యమని భావించింది. మాధవి తన గదిలో ఉరి వేసుకుంది. అయితే, చనిపోయే ముందు తన తండ్రి పరిస్థితిని తలచుకుని ‘నాన్న జాగ్రత్త’ అని తన చేతిపై పెన్నుతో రాసుకుంది. తాను లేని లోటు తన తండ్రిని ఎంతగా వేధిస్తుందోనన్న ఆవేదన ఆ అక్షరాల్లో కనిపించింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. మాధవి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామస్థులు సైతం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఒక యువ టీచర్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడంతో మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement
Advertisement