మన పత్రిక, నాయుడుపేట: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో ఏర్పాటు చేసిన ‘టిడ్కో’ (TIDCO) సంక్షేమ గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కింద ఏకకాలంలో 2.50 లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రాయచోటిలో 3 లక్షల ఇళ్లు పంపిణీ చేశామని, ఇప్పుడు మరో 2.5 లక్షల ఇళ్లను అందించామని, మొత్తం 5.50 లక్షల ఇళ్లు పేదలకు అప్పగించామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇళ్ల పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, రూ. 816 కోట్ల అప్పు చేసిందని మండిపడ్డారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లు కట్టించి పేదలను మోసం చేయడంతో పాటు.. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని ధ్వజమెత్తారు.
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, దానికి చట్టరూపం దాల్చాక ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. హైదరాబాద్, చెన్నై నగరాల కంటే అమరావతిని నెంబర్ వన్‌గా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతీ ఒకటో తేదీనే 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తున్నామని, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని రూ. 20 వేలకు పెంచామని చంద్రబాబు వివరించారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
