WhatsApp
Advertisement

పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!

మన పత్రిక వెబ్​డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల తమ దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ పొరుగు దేశాలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయా దేశాల భూభాగం నుంచి ఇరాన్‌పై దాడులు జరగనంత వరకు, తమ వైపు నుంచి కూడా ఎలాంటి క్షిపణులు ప్రయోగించబోమని.. ఇందుకు ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి అంగీకరించిందని ప్రభుత్వ టీవీ ద్వారా వెల్లడించారు.

అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్‌లకు పెజెష్కియాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శత్రువుల ముందు ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని, “ఇరాన్ ప్రజలు లొంగిపోవాలన్న తమ కోరికను శత్రువులు తమ సమాధుల్లోకి తీసుకెళ్లాల్సిందే” అని ఆయన కుండబద్దలు కొట్టారు.

Advertisement

గల్ఫ్ దేశాల్లో ఇరాన్ ప్రతీకార దాడులు: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు.

దీనికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. దుబాయ్, అబుదాబి, ఖతార్, కువైట్, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో వినాశనకర దాడులు చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పామ్ జుమేరా, బుర్జ్ అల్ అరబ్ లాంటి లగ్జరీ ప్రాంతాలతో పాటు.. అమెరికా కాన్సులేట్, బహ్రెయిన్‌లోని చమురు శుద్ధి కర్మాగారం, ఖతార్‌లోని అల్-ఉదీద్ బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్: తమ ఎయిర్ బేస్, చమురు క్షేత్రాలపై (రాస్ తనురా రిఫైనరీ) ఇరాన్ చేసిన దాడులను తిప్పికొట్టినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ వెల్లడించారు. పరిస్థితిని తప్పుగా అంచనా వేసి తమ జోలికి రావొద్దని ఇరాన్‌ను ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Advertisement