మన పత్రిక వెబ్‌డెస్క్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జిల్లావ్యాప్తంగా హస్తం పార్టీ హవా కొనసాగింది. ముఖ్యంగా బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకపక్ష విజయాలతో ప్రభంజనం సృష్టించి, రెండు మున్సిపల్ పీఠాలను బంపర్ మెజారిటీతో దక్కించుకున్నారు.
బిచ్కుంద మున్సిపాలిటీ ఫలితాలను పరిశీలిస్తే, మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. ఏకంగా 10 వార్డుల్లో విజయం సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి, ఇతరులకు చెరో ఒక్క సీటు మాత్రమే దక్కింది. దీంతో బిచ్కుంద చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోనూ అచ్చం ఇలాంటి ఫలితాలే పునరావృతమయ్యాయి. ఇక్కడ కూడా మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కాగా, మరొక స్థానంలో ఇతరులు గెలుపొందారు. రెండు ప్రధాన మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగలడంతో ఆ పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి.
ఈ రెండు మున్సిపాలిటీల్లో సాధించిన భారీ విజయంతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయా పట్టణాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2% డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం
- Telangana Weather: 5 రోజుల పాటు వర్షాలు.. జిల్లాల వారీగా వివరాలు
- Gold Price Today: ఈరోజు బంగారం ధరలు April 18
- Lenskart: బాయ్‌కాట్ ట్రెండ్‌పై సీఈవో వివరణ, క్షమాపణలు
