WhatsApp
Advertisement

ఉత్కంఠ పోరు: మొదలైన మున్సిపల్ కౌంటింగ్..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే ఈ ఘట్టం కోసం ఓటర్లతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 123 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మొత్తం 7 నగర పాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డులకు సంబంధించిన ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు.

లెక్కింపు సరళిని బట్టి చూస్తుంటే మధ్యాహ్నం సమయానికి మున్సిపాలిటీల ఫలితాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం లోపు కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు వెబ్‌కాస్టింగ్ ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.

Advertisement

కౌంటింగ్ హాల్‌లోకి నిబంధనలను కఠినతరం చేశారు. కేవలం విధులు నిర్వర్తించే అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించడం లేదు. నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారు. వార్డులవారీగా బ్యాలెట్ పత్రాలను డ్రమ్ములో కలిపి, ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ప్రతి రౌండ్ పూర్తయ్యాక ఏజెంట్ల సంతకాలు తీసుకుని ఫలితాలను ప్రకటిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ వంటి పెద్ద కార్పొరేషన్లలో లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది.

ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తదుపరి ఘట్టం కూడా సిద్ధంగా ఉంది. గెలిచిన అభ్యర్థుల ద్వారా ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలాగే మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఈరోజు ఫలితాలు రాగానే క్యాంపు రాజకీయాలు కూడా ఊపందుకునే అవకాశం ఉంది.

Advertisement