మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. నామినేషన్ల ఘట్టం ముగిసి, ఉపసంహరణల పర్వం కూడా పూర్తికావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోగా, ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) ఓటర్లకు కీలక సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి, బరిలో ఉన్న అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఆస్తులు, అప్పులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసుల చిట్టాను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఓటర్లు తమ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్‌ను స్వయంగా పరిశీలించుకునే అవకాశాన్ని కల్పించింది.
అభ్యర్థుల వివరాలను తెలుసుకోవాలనుకునే ఓటర్లు ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://tsec.gov.in ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘కాండిడేట్ పోర్టల్’ ఆప్షన్‌ను ఎంచుకుని, అక్కడ ‘అఫిడవిట్ ఫైల్డ్ బై కంటెస్టింగ్ కాండిడేట్’ అనే విభాగంలోకి వెళ్లాలి. అక్కడ రూరల్ లేదా అర్బన్ కేటగిరీని ఎంచుకున్న తర్వాత.. మీ జిల్లా, కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ, వార్డు వివరాలను నమోదు చేయాలి. అనంతరం ‘గెట్ డీటైల్స్’ పై క్లిక్ చేస్తే ఆ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా కనిపిస్తుంది. వారి పేర్ల పక్కనే ఉండే అఫిడవిట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వారి పూర్తి జాతకాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు గానూ 12,993 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా ఉంచేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని కూడా వాడుకుంటోంది. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం, పోలింగ్ కేంద్రాల వివరాల కోసం ప్రత్యేకంగా ‘TE-Poll’ (టీ-పోల్) మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్లు తమకు ఎదురయ్యే సమస్యలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, ఆ ఫిర్యాదు స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడను ఉన్నాయి. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి, అభ్యర్థుల పూర్వాపరాలను పరిశీలించి ఓటు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
