మన పత్రిక వెబ్‌డెస్క్, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. “ప్రజాపాలన – ప్రగతిబాట” కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ. 200 కోట్ల చొప్పున, మొత్తం రూ. 600 కోట్లతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ (YIIRS) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం కృషి చేస్తానని, ఇక్కడి వ్యవసాయం దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు. ఇదే వేదికపై ఇందూరు జిల్లా మహిళా సమాఖ్యకు చెందిన స్వయం సహాయక సంఘాలకు రూ. 200 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.
విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. రూ. 20 కోట్లతో ఎస్సీ విద్యార్థుల హాస్టల్, రూ. 8.60 కోట్లతో బాలికల హాస్టల్, రూ. 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 18 కోట్లతో నిర్మించిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. యూనివర్సిటీలో ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్ఈ భవనాల విస్తరణ పనులకు సుమారు రూ. 43 కోట్లు కేటాయించారు. వీటితో పాటు జిల్లాలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు గాంధీనగర్ నుంచి బినోలా రోడ్డు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సిరన్‌పల్లి మీదుగా నిజాంపూర్ వరకు రోడ్డు వెడల్పు పనులకు రూ. 21 కోట్లతో శంకుస్థాపన చేశారు.
ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2023లో తాను పీసీసీ అధ్యక్షుడిగా, మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తెచ్చామో, 2029లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి.శ్రీనివాస్ జోడీలాగే.. రేపు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా, తాను ముఖ్యమంత్రిగా రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదని, వారిది ఫెవికాల్ బంధమని విమర్శించారు. ఆ పార్టీలకు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్టేనని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
