మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి నాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి పండుగకే ఈ నిధులు తమ ఖాతాల్లో జమవుతాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూశారు. కానీ, పండుగ వెళ్లిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం నిధుల విడుదలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ జాప్యం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, జనవరి నెలాఖరు నాటికి నిధులు విడుదల చేస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈసారి నిబంధనలను కఠినతరం చేసింది. కేవలం పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇందుకోసం శాటిలైట్ ద్వారా పంటల వివరాలను సేకరిస్తోంది. ఎవరెవరు ఎంత విస్తీర్ణంలో పంట వేశారనేది శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే నిధులు విడుదల చేయాలని భావిస్తోంది.
ఈ శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సర్వే పూర్తయిన తర్వాతే అర్హుల జాబితాను రూపొందించి నిధులు జమ చేయనున్నారు. దీంతో జనవరిలో వస్తుందనుకున్న సాయం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే.. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో రైతులు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
