మన పత్రిక వెబ్‌డెస్క్, ములుగు: చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెలుపల, ఆదివాసీ దైవాలు సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, మేడారం అభివృద్ధిపై మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
మున్సిపల్ ఎన్నికలకు నగారా పదవీకాలం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు (2,996 వార్డులు/డివిజన్లు) సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలతో పాటు విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో, అంతకంటే ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావించింది.
మెట్రో టేకోవర్ & రూ.2,787 కోట్లు హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ (L&T) సంస్థ నుంచి ప్రభుత్వం టేకోవర్ చేసే అంశంపై చర్చించిన మంత్రివర్గం, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అలాగే మెట్రో ఫేజ్-2 (ఏ, బీ) విస్తరణ పనుల కోసం భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఇందుకోసం రూ. 2,787 కోట్లను కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లే-అవుట్ వరకు 9 కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది.
జంపన్న వాగులో నిరంతరం నీరు మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం జంపన్న వాగులో 365 రోజులు నీరు ఉండేలా రూ. 143 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేశారు. రామప్ప, లక్నవరం చెరువుల నుంచి గోదావరి నీటిని లిఫ్ట్ చేసి ఇక్కడికి తరలించనున్నారు. అలాగే ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు.
ఇతర కీలక నిర్ణయాలు:
- మేడారం అభివృద్ధి: సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు మరో 20-21 ఎకరాల భూసేకరణ.
- గోదావరి పుష్కరాలు: 2027లో జరగనున్న పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి, ఎకో-టూరిజం సర్క్యూట్ ఏర్పాటు.
- విద్యాశాఖ: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో లా కాలేజీ ఏర్పాటు.
మేడారం జాతరను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా, కుంభమేళాను తలపించేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
