Advertisement

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (GGH) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ఓపీ, స్కానింగ్ విభాగాలను పరిశీలించి, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు.

పెండింగ్ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలి వివిధ చికిత్సల కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేసి రోజువారీ ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల వివరాలపై ఆరా తీశారు. అనంతరం దివ్యాంగుల ధ్రువపత్రాల జారీ (UDID) కేంద్రాన్ని సందర్శించారు. అక్కడకు వచ్చిన నార్కట్‌పల్లికి చెందిన సైదమ్మ, తుమ్మడం గ్రామానికి చెందిన నాగరాజులతో మాట్లాడి, స్లాట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 823 మందికి స్కానింగ్ పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లు జారీ కాలేదని ఇన్‌ఛార్జి తెలపగా, కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగవంతం చేసి, వెంటనే ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించారు.

Advertisement

ఆలస్యంగా వస్తే చర్యలు తప్పవు అనంతరం క్రిటికల్ కేర్, స్కిన్ ఓపీ, ఫిజియోథెరపీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఫిజియోథెరపీకి వచ్చిన హుజూర్నగర్ వాసి నాగయ్యతో మాట్లాడి, బీపీ నియంత్రణలో ఉంచుకోవాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఆసుపత్రి క్యాంటీన్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది హాజరును తనిఖీ చేసిన కలెక్టర్.. కొంతమంది ఉద్యోగులు సమయానికి రాకపోవడాన్ని గమనించారు. విధులకు ఆలస్యంగా వచ్చిన వారందరికీ మెమోలు జారీ చేయాలని సూపరింటెండెంట్ నేత నరసింహారావును ఆదేశించారు. ఈ పర్యటనలో డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, డాక్టర్ స్వరూప, డాక్టర్ వందన తదితరులు పాల్గొన్నారు.

Advertisement