మన పత్రిక, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుండగానే, ఆ బాధ్యతలను నితిన్ నబీన్‌కు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడం, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో.. మొదట ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. గతంలో జేపీ నడ్డా కూడా ఇదే తరహాలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి, ఆ తర్వాతే పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే జనవరిలో నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి వంటి సీనియర్ల పేర్లు వినిపించినా, అధిష్టానం మాత్రం యువ రక్తాన్ని ఎంచుకుంది.
ఎవరీ నితిన్ నబీన్? బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ వయసు 45 ఏళ్లు. తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన హఠాన్మరణంతో బిట్ (మెస్రా)లో చదువుతున్న నితిన్ రాజకీయాల్లోకి రాాల్సి వచ్చింది. కేవలం 26 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యే అయిన నితిన్.. ఇప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్, బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఇన్చార్జ్గా ఆయన చూపిన పనితీరు మోదీ-షాలను మెప్పించింది. 52 ఏళ్ల వయసులో గడ్కరీ అధ్యక్షుడైతే, అంతకంటే చిన్న వయసులోనే నితిన్ ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నారు.
చిత్రగుప్తుడి వారసుడు (కాయస్థ సామాజిక వర్గం) నితిన్ నబీన్ ఎంపికలో కులం కోణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఆయన ‘కాయస్థ’ సామాజిక వర్గానికి చెందినవారు. పురాణాల ప్రకారం యమధర్మరాజు దగ్గర పాపపుణ్యాల చిట్టా రాసే చిత్రగుప్తుడిని ఈ కులస్థులు తమ మూలపురుషుడిగా, చిత్రగుప్తుడి వారసులుగా భావిస్తారు. బ్రహ్మదేవుడి కాయం (శరీరం) నుంచి పుట్టారు కాబట్టి వీరిని కాయస్థులు అంటారు. బీహార్‌లో ఈ సామాజిక వర్గం జనాభా 1% కంటే తక్కువే అయినా (0.6%), వీరు అత్యంత విద్యావంతులు, మేధావులు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు ఈ వర్గానికి చెందినవారే.
మోదీ-షా మాస్టర్ ప్లాన్ సాధారణంగా ఓటు బ్యాంకు రాజకీయాలు నడిచే దేశంలో.. సంఖ్యాపరంగా తక్కువ ఉన్న సామాజిక వర్గానికి చెందిన నితిన్‌ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ కొత్త సంకేతాలు పంపింది. కేవలం కులబలం కాకుండా, పనితీరు, యువతకు ప్రాధాన్యం అనే అంశాలకే పెద్దపీట వేసింది. సంఘ్ పరివార్‌లో కూడా 50-55 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యం పెరుగుతోంది. బీజేపీ అంటే కేవలం గుజరాతీల ఆధిపత్యం ఉన్న పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవడానికే ఈ ‘హిందూ-హిందీ’ కార్డును ప్రయోగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
