Advertisement

Sreelekha Ips: మేయర్ రేసులో మాజీ డీజీపీ శ్రీలేఖ..

మన పత్రిక, వెబ్​డెస్క్: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. నిన్నటి వరకు ప్రియాంక గాంధీపై పోటీ చేసిన నవ్య హరిదాస్ గురించి చర్చించుకుంటే, నేడు మాజీ ఐపీఎస్ అధికారిణి శ్రీలేఖ విజయం హాట్ టాపిక్‌గా మారింది. 1987 బ్యాచ్‌కు చెందిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారి శ్రీలేఖ, డీజీపీ హోదాలో రిటైర్ అయిన అనంతరం బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలి హోదాలో ఉండి కూడా, పార్టీ ఆదేశాల మేరకు తిరువనంతపురంలో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఘనవిజయం సాధించారు.

తిరువనంతపురంలో ఎన్డీయే హవా తిరువనంతపురం కార్పొరేషన్‌లో మొత్తం 101 స్థానాలకు గాను బీజేపీ కూటమి 50 స్థానాలను కైవసం చేసుకుంది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కోటలో కాషాయ జెండా ఎగురవేయడం ఇదే తొలిసారి. గతంలో 30 సీట్లు గెలిచిన బీజేపీ, ఈసారి ఏకంగా మేయర్ పీఠం దక్కించుకునే స్థాయికి ఎదిగింది. కొల్లం, కోజికోడ్ కార్పొరేషన్లలోనూ బీజేపీ పదేసి సీట్లు గెలిచి తన ఉనికిని చాటుకుంది.

Advertisement

మేయర్ పీఠం ఎవరిది? బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ, మేయర్ పీఠం దక్కడం అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. కార్పొరేషన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు ఉండటమే ఇందుకు కారణం. అక్కడ ఎంపీగా ఉన్న శశిథరూర్ (కాంగ్రెస్) సహా ఎమ్మెల్యేలంతా నాన్-బీజేపీ సభ్యులే కావడం గమనార్హం. మేయర్ పీఠం కోసం ఎల్డీఎఫ్, యూడీఎఫ్ చేతులు కలుపుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేరళలో బద్ధ శత్రువులైన ఈ రెండు కూటములు కలిస్తే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

శ్రీలేఖ ప్రస్థానం 33 ఏళ్ల సర్వీసులో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీలేఖ, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాల హయాంలో ఎక్కువగా లూప్ లైన్ పోస్టులకే పరిమితమయ్యారు. ఒక హత్య కేసులో కేవలం 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి డీఎస్పీకి శిక్ష పడేలా చేసిన ట్రాక్ రికార్డ్ ఆమెకుంది. ప్రస్తుతం ఆమె మేయర్ రేసులో ముందున్నారు. మరోవైపు, దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డు సృష్టించిన ఆర్య రాజేంద్రన్ (LDF) పదవికి గండం ఏర్పడింది.

Advertisement