రణబీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రం వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శన లాస్ ఏంజెల్స్‌లో ఏర్పాటు కానుంది. అక్టోబర్ 27న అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లోని డెవిడ్ గ్రెఫెన్ థియేటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ ప్రీమియర్ ప్రదర్శనను 3డి విధానంలో ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో సహా దాదాపు 945 మంది అతిథులు ఈ ఈవెంట్‌కు హాజరవుతారని భావిస్తున్నారు.
దీపావళి థీమ్, సాంప్రదాయ దుస్తులు
ఈ ప్రీమియర్ కార్యక్రమానికి దీపావళి పండుగ థీమ్‌ను ఎంచుకున్నారు. రెడ్ కార్పెట్ కోసం అతిథులు భారతీయ సాంప్రదాయ పండుగ దుస్తులలో రావాలని నిర్వాహకులు కోరినట్లు నివేదికలు తెలిపాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసం ఆధారంగా రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపిస్తారు. మొదటి భాగం 2026 నవంబర్ 5న, రెండవ భాగం 2027 దీపావళికి విడుదలయ్యేలా ప్రణాళిక చేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
