Advertisement

ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్

మన పత్రిక, న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి నాయకులు పార్లమెంట్ నుంచి భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు నిరసన ప్రదర్శన ప్రారంభించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ మార్చ్‌లో ముందుకు సాగారు. అయితే, నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు.

Advertisement

పోలీసులు ప్రదర్శనను నిలిపివేసిన తర్వాత రాహుల్ గాంధీ పోలీసు బారికేడ్‌పైకి ఎక్కి జాతీయ జెండాను ఊపారు. అనంతరం ఆయన ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఇండియా కూటమి నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ఈ వ్యవహారంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నిరసనకు ముందే రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, సీఈసీ రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించారు.

Advertisement