Advertisement

సిఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ ఇండియా కూటమి మార్చ్

మన పత్రిక, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) వివాదంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష ఎంపీలు అక్టోబర్ 6న నిరసన ప్రదర్శన చేపట్టారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వచన్ సదన్ వైపు ప్రతిపక్ష ఎంపీలు మార్చ్ నిర్వహించారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఓటర్ల నమోదు ఫారమ్‌లలో మార్పులు చేయడం వల్ల అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. సెప్టెంబర్ 30న జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ నుంచి బయలుదేరిన ఎంపీలు ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలంటూ నినాదాలు చేశారు.

Advertisement

ప్రతిపక్షాల నిరసన మార్చ్ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్, సంసద్ మార్గ్, ఎన్నికల సంఘం కార్యాలయ పరిసరాల్లో పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలను రంగంలోకి దించారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధానిలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మరోవైపు, ఓటర్ల ముమ్మర సవరణ ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈ ప్రక్రియలో అంతర్గత విభేదాలు ఏవీ లేవని, నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసింది. కాగా, జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ వారి సమాధానాన్ని కోరింది.

Advertisement